Anukoni Prayanam Movie Review and Rating
Anukoni prayanam movie review and rating
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో నుండి ‘ఆ నలుగురు’ తర్వాత ట్రాక్ మార్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు చేస్తూ, కథాబలం ఉన్న సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’, ‘టామి’ వంటి చిత్రాలను చేసిన ఆయన లేటెస్ట్ మూవీ ‘అనుకోని ప్రయాణం’ శుక్రవారం విడుదలైంది. సీనియర్ నటుడు నరసింహరాజు సైతం ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. డాక్టర్ డీవై జగన్ మోహన్ కథను అందించి, నిర్మించిన ఈ మూవీని వెంకటేశ్ పెదిరెడ్ల డైరెక్ట్ చేశారు.
ఇది రెండేళ్ళ క్రితం కథ. సరిగ్గా జనతా కర్ఫ్యూ పెట్టడానికి మూడు రోజుల ముందు మొదలయ్యే కథ. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు భువనేశ్వర్ లో ఓ కాంట్రాక్టర్ దగ్గర రోజు కూలీలుగా పని చేస్తుంటారు. అక్కడ తెలుగు వాళ్ళైన కూలీలు చాలామందే ఉంటారు. కుటుంబాలకు దూరంగా ఉండే ఆ కూలీలంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి మెలిసి జీవిస్తుంటారు. ఇంతలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొద్ది రోజుల పాటు కన్ స్ట్రక్షన్ పనికి ఫుల్ స్టాప్ పెట్టి, కూలీలందరినీ సొంత వూళ్ళకు పంపేస్తారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు సైతం తమ ఊళ్ళకు బయలు దేరతారు. పెళ్ళి పెటాకులు లేని రాజేంద్ర ప్రసాద్ ను కూడా తన ఊరికే రమ్మని నరసింహరాజు ఒత్తిడి చేస్తాడు. ముందు ససేమిరా అన్నా… తర్వాత అతనూ మనసు మార్చుకుని రాజమండ్రి సమీపంలోని నరసింహారాజు ఊరికి బయలుదేరతాడు. ఇంతలో ఊహించని విధంగా మార్గం మధ్యలో రాజు గుండెపోటుతో చనిపోతాడు. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ఆ శవాన్ని తీసుకుని రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రికి బయలుదేరతాడు. దేశ వ్యాప్తంగా కర్ప్యూ విధించిన ఆ సమయంలో ఈ ‘అనుకోని ప్రయాణం’లో అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? చివరకు ఆ గ్రామానికి ఎలా చేరాడు? కరోనా నేపథ్యంలో ఆ గ్రామస్తులు ఎలా స్పందించారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కరోనా సమయంలోని అనుభవాలను నిర్మాత డాక్టర్ జగన్ మోహన్ ఓ కథగా మలుచుకుని ఈ సినిమా నిర్మించారు. దాంతో చాలా సంఘటనలు మన కళ్ళ ముందు జరిగిన, మన అనుభవంలోకి వచ్చినవి గానే ఉంటాయి. పైగా కరోనా కాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు, వలస కూలీలు ఎదుర్కొన్న సమస్యలు తెలిసిన వారు ఈ మూవీతో బాగానే కనెక్ట్ అవుతారు. అయితే… ఓ శవాన్ని తీసుకుని భువనేశ్వర్ నుండి రాజమండ్రి చేరే క్రమంలో కథానాయకుడికి తారసపడి వ్యక్తులు, వారి ప్రవర్తన, దాని పర్యవసానం అనేది ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
చావు పుట్టుకలను పెద్దంతగా పట్టించుకోని రాజేంద్ర ప్రసాద్ ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రవర్తించడంతో అతని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆసక్తికరంగా ఉంది. ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్రను వేసుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్… తన ఫ్రెండ్ శవాన్ని వీపు మీద పెట్టుకుని మైళ్ళ కొద్దీ నడుస్తూ ఉంటే సన్నివేశం హృదయాన్ని కలచి వేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ మార్క్ కామెడీని దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. కరోనా సమయంలో తల్లిదండ్రుల శవాలను దహనం చేయడానికే కొడుకులు వెనకాడిన పరిస్థితి. ఆ టైమ్ లో ఊరికి స్నేహితుడి శవాన్ని నానా కష్టాలు పడి తీసుకొచ్చి…. జనం దాన్ని పట్టించుకోలేదని రాజేంద్ర ప్రసాద్ పాత్ర మొత్తుకోవడంలో అర్థవంతంగా ఉంది.
అనుకోని ప్రయాణం కాన్సెప్ట్ నచ్చి రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, నారాయణరావు, ‘శుభలేఖ’ సుధాకర్, తులసి వంటి నటీనటుల ఇందులో నటించారు. కాస్తంత గ్యాప్ తర్వాత టాలీవుడ్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన ప్రేమ పాత్ర బాగుంది! ఎస్. శివ దినవహి సమకూర్చిన బాణీలు, వాటి సాహిత్యం సన్నివేశాలకు అనుగుణంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. అక్కడక్కడ వారి మెరుపులు కనిపించాయి. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
రేటింగ్: 3/5