బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు
లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అంతేకాదు లాక్డౌన్ అనంతరం కూడా సోనూ..సహాయం చేయడం మాత్రం ఆపలేదు. సాయం కావాలంటూ.. ఎవరు అడిగిన లేదనకుండా సహాయం చేశాడు. తన సంపాదన కరిగిపోయినా కానీ.. వలస కార్మికులకు సాయాన్ని అందించాడు. దీంతో చాలా మంది సోనూసూద్‌ను రియల్ హీరోగా.. తమ ఆరాధ్య దేవుడిగా కొలిచారు. మరికొంతమంది వలస కార్మికులు తమ దుకాణాలకు ఆయన పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిని కలిసాడు రియల్ హీరో.
బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన పండగ నవీన్ ఆర్ఎంపీగా పనిచేస్తుంటారు. నవీన్, త్రివేణి దంపతులకు ఇటీవల కూతురికి జన్మించింది. ఆ చిన్నారికి సోనాలి సూద్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2న పాపకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రావాలంటూ.. సోనూసూద్‌ను ఆహ్వానిస్తూ.. ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఇక ఆ పత్రిక సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే.. రియల్ హీరో ఆ జంటను కలిశాడు. ఆ కుటుంబాన్ని కలిసి.. వారితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.